సూర్య టైటిల్ రోల్ చేసిన 'గజిని' మూవీ తమిళంలోనే కాకుండా తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ మూవీతో తెలుగునాట కూడా సూర్య మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో నాయికగా అసిన్ నటించింది. హారిస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి ఎస్సెట్. అందులో "హృదయం ఎక్కడున్నదీ.." సాంగ్ విపరీతంగా పాపులర్ అయ్యింది. ఎవరి నోట విన్నా ఆ పాటే, ఆ రోజుల్లో. దాన్ని రాసింది వెన్నెలకంటి. ఆ పాట వెనుక ఓ కథ ఉంది.
'గజిని'ని తెలుగులో డబ్ చేసేటప్పుడు డైలాగ్ రైటర్‌గా వెన్నెలకంటి కుమారుడు శశాంక్ వెన్నెలకంటిని ఎంచుకున్నారు నిర్మాత 'ఠాగూర్' మధు. పాటల్లో రెండు వేటూరి చేత, ఒకటి భువనచంద్రతో, ఒకటి చంద్రబోస్‌తో, ఒకటి వెన్నెలకంటితో రాయించే బాధ్యతను శశాంక్కే అప్పగించారు మధు. "మీ నాన్నగారితో ఏ పాట రాయిస్తున్నావు?" అని అడిగారు. ఒరిజినల్లోని "సుట్టుం విళి సుడరే.." అని చెప్పాడు శశాంక్. "ఎందుకలా? ఆ పాట పెద్ద హిట్ కాబట్టా?" అనడిగారు మధు.
"కాదంకుల్. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. సాహిత్యంలో డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని పెద్దవారితో రాయించాలంటే.. వారితో నాకంత చనువు లేదు. నాన్నగారైతే ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు నచ్చిన విధంగా ఒకటికి రెండుసార్లు అడిగి రాయించుకోవచ్చు" అని చెప్పాడు శశాంక్. "ఊరికే అన్నాలే. మీ నాన్నగారితోనే ఆ పాట రాయించుకో".. నవ్వుతూ అన్నారు మధు.
అది.. అసిన్ చుట్టూ తిరుగుతూ సూర్య పాడే పాట. "హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ.. నీ చుట్టూనే తిరుగుతున్నదీ.." అని పల్లవి రాశారు వెన్నెలకంటి. పాట పూర్తయ్యాక, "బాణీకి సరిపోయే పదాలతో ఉంది కానీ, మొదటి రెండు లైన్లు మాత్రం పొసగలేదు నాన్నగారూ" అన్నాడు శశాంక్. ఆయన నవ్వి, "నీది ఆవేశం, నాది అనుభవం. చూడు ఈ పల్లవి ఎంత పాపులర్ అవుతుందో!" అన్నారు. ఆశ్చర్యమేమంటే పల్లవే కాదు, చరణాలు కూడా జనం నోట్లో నానాయి. దాదాపు రెండేళ్ల పాటు ఏ సెల్ ఫోన్ చూసినా, రింగ్ టోన్ ఈ పాటే. బాంబే జయశ్రీ, హరీశ్ రాఘవేంద్ర ఈ పాటను ఆలపించారు.